నమస్తే శేరిలింగంపల్లి: పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, భవిష్యత్తు తరాల కోసం ఈ భూమి అనుకూలంగా ఉండేలా తయారు చేసే అవకాశం నేటి తరానికి ఉందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ విభాగ ఆచార్యులు యం. జయానంద్ సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బీహెచ్ఈఎల్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆచార్యులు యం. జయానంద్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి 1970 నుంచి ఎర్త్ డే నిర్వహిస్తున్నారని అన్నారు. సమస్త జీవ కోటి భారాన్ని మోసేది పుడమి తల్లి అని తెలిసినా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఆ తల్లి దేహానికి గాయాలు చేస్తున్నారని వాపోయారు. విశ్వంలో మనకు తెలిసిన అన్ని గ్రహాలలోకి ఒక భూగ్రహం మాత్రమే ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటుందనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. ఈ నేల గ్రహంపై పరుచుకున్న పచ్చటి వృక్షాలు, కొండ, కోనలు, నీరు వంటి ప్రకృతి సంపద అంతా కలసి ఇక్కడ మనుషులతో పాటు ఇతర జీవ రాశులు బ్రతకటానికి సహకరిస్తున్నాయని చెప్పారు.

మానవుల బాధ్యతారాహిత్యం వల్ల పెరుగుతున్న కాలుష్యంతో భూమి మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆదివాసీలు, అడవులలో బ్రతికే వారు తమ చుట్టూ ఉన్న ప్రకృతితో జీవనం చేస్తుంటే అన్ని తెలిసిన నాగరికుడు అభివృద్ధి, ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపించి, హద్దు, అదుపు లేకుండా ప్రకృతి వనరులను దోచేస్తున్నారన్నారు. భూతాపం విపరీతంగా పెరిగి పర్యావరణంలో అనేక మార్పులు చోటుచేసుకొని తత్ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రమాదం ఉందని చెప్పారు. మనిషి సాధించిన అభివృద్ధి ఏమిటీ అని కరోనా ప్రశ్నిస్తూ మనిషి తెలివితో సాధించిన అభివృద్ధి తనని నాశనం చేయడం లేదని ఎగతాళిగా నవ్వుతూ, ఖాళీగా ఉండే స్మశానాలను రద్దిగా మార్చిందన్నారు. చంద్రుడితో పాటు ఇతర గ్రహాల పైకి వెళ్లి జీవనం సాగించటానికి వీలుందని తెలుసుకొనేంత జ్ఞానం ఉన్న మనిషి కంటికి కనిపించని చిన్న వైరస్ ను నాశనం చేయలేకపోవటం అనేది ఇన్ని సంవత్సరాలుగా సాధించిన అభివృద్ధిని వేలెత్తి చూపిస్తుందన్నారు. ఈ మహమ్మారి సృష్టిస్తున్న అల్లకొల్లోలం గుర్తించి పుడమి తల్లితో పాటు, పంచభూతులను రక్షించుకుని మానవ మనుగడను ప్రశాంతంగా కొనసాగించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మిగతా దేశాల కంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ అని, మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే అని, మన భూగోళాన్ని కాపాడుకోవటం కోసం కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. వాహనాల వాడకం తగ్గించి, అనవసర విద్యుత్ వాడకం, అడవులను నాశనం చెయ్యకుండా చెట్లను పెంచటం అలవాటుచేసుకుందామని అన్నారు. భూమికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించి, ప్రకృతి వనరులను సంరక్షించుకొని, భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ నిక్కత్ అంజూమ్, వైస్ ప్రిన్సిపాల్ సి.జ్యోతి, ఎకనామిక్స్ లెక్చరర్ పి.మురళి కృష్ణ, అధ్యాపకులు సీహెచ్ బిక్షపతి, డా. అర్ జి వి మోహన్, డా. అనిత, సీహెచ్ జానయ్య, డా. ఎన్ గోపాల్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, శివరామకృష్ణ, పాలెం శ్రీను, జనార్దన్, విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






