శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద సేవా సంఘం వృద్ధుల ఆశ్రమంలో మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహింకారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ భార్గవ్ (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ అబ్రహం లింకన్ (ఆంకాలజిస్టు), డాక్టర్ షమీర్(కౌ డెంటల్) తదితరులు వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానం, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఆశ్రమ నిర్వాహకుడు సుందర ప్రసాద్, సంఘ సేవకుడు వెంకట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, హాస్పిటల్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు.






