శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): తాను పనిచేస్తున్న అపార్ట్‌మెంట్స్‌కు చెందిన ఓ ఫ్లాట్‌లో ఓ వాచ్‌మన్ దొంగతనానికి పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని మయూరినగర్ కౌస్తుభం రెసిడెన్సీ ఫ్లాట్ నం.101లో నివాసం ఉంటున్న మిట్టపల్లి నాగేశ్వర్ రావు స్థానికంగా బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆగస్టు 2వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో అతను తన ఫ్లాట్‌కి తాళం వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తన సొంత గ్రామానికి వెళ్లాడు. ఆగస్టు 5వ తేదీన రాత్రి 7 గంటలకు వచ్చి చూడగా తన ఫ్లాట్‌లోని హాల్‌కు ఉన్న కిటికీ పగలగొట్టబడి ఉంది. లోపలికి వెళ్లి చూడగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఐరన్ బీరువా తాళం తెరిచి ఉంది. ఈ క్రమంలోనే అందులో ఉన్న 10 గ్రాముల బంగారం, 2 చెవి రింగులు, రూ.30వేల నగదు మాయమైనట్లు గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే అపార్ట్‌మెంట్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఎస్.ప్రసాద్ (32)పై అనుమానం వచ్చి తమదైన శైలిలో అతన్ని విచారించగా, అతను తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతని నుంచి 10 గ్రాముల గోల్డ్ నెక్లెస్, 2 చెవి రింగులు, రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతన్ని రిమాండ్‌కు తరలించారు.





