సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): వాహనాలను నడిపే సమయంలో దృష్టిని రహదారిపైనే నిలపాలని, నిబంధనలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ కుమార్ మాట్లాడుతూ.. వాహనం అంటే.. 3 అంశాలను గుర్తుంచుకోవాలన్నారు. ఏ, బీ, సీ అనే అంశాలు.. అంటే.. యాక్సలరేటర్, బ్రేక్, క్లచ్.. అనే అంశాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే డ్రైవింగ్ సులభతరం అవుతుందని అన్నారు. అలాగే ద్విచక్ర వాహనాలను నడిపే వారు హెల్మెట్లను, కార్లను నడిపేవారు సీట్ బెల్ట్‌లను విధిగా ధరించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. సిబ్బందికి డ్రైవింగ్‌లో శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 6 గంటల థియరీ, 14 గంటల ప్రాక్టికల్ క్లాసులకు హాజరు కావాలని అన్నారు. దీంతో మొత్తం 20 గంటల ట్రెయినింగ్ పూర్తవుతుందన్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సూచించిన 40 రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ క్రైమ్స్-1 కవిత, స్ట్రీట్ వైజ్ డ్రైవింగ్ స్కూల్ యజమాని మాల్కం వొల్ఫె, శిక్షకులు ఆది శంకర్, లవీన్ బలెరావు, సీటీసీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎంటీవో ఆర్ఐ వెంకట స్వామి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.