శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతోందో ERO నారాయణ్ అమిత్ అధికారులతో కలిసి విస్తృతంగా పరిశీలించారు. మసీదుబండ, కొండాపూర్, జైన్ కాలనీ, గచ్చిబౌలి, టెలికాం నగర్, గౌతమి ఎన్క్లేవ్, రాఘవేంద్ర కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా సమీక్షించారు. ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేసి ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్న ప్రక్రియను అధికారులు పరిశీలించారు. పెండింగ్ నమోదు లేకుండా రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

BLOలు, సూపర్వైజర్లు నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ పనులను కూడా పరిశీలించిన ERO, కొత్తగా నివాసం ఏర్పరుచుకున్న కుటుంబాలు, వలస వెళ్లిన వారు, మరణించిన వారి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. డూప్లికేట్ ఎంట్రీలు లేదా తప్పుడు సమాచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత గడువులోపు అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువతతోపాటు కొత్తగా వచ్చి చేరిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. SIR-2026 ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచుతూ వారి సహకారంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని, ప్రజల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌డెస్క్‌లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేసి లోపాలు లేని, స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని ERO నారాయణ్ అమిత్ తెలిపారు.





