ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీలకు ఆర్థిక, సామాజిక, విద్యా, వైద్య రంగాల్లో పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, బీసీలు ఏకమై రాజకీయ అధికారం సాధించాల్సిన అవసరం ఉందని బీసీ కులాలు, బీసీ సంఘాల తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లిలోని నేతాజీ నగర్ గుల్మోహార్ పార్క్‌లో నిర్వహించిన బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కార్యవర్గాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమాలను విస్తరించాలని, బీసీల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రజలు ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ, సామాజిక న్యాయం ఇంకా పూర్తిగా అందలేదని ఆయన పేర్కొన్నారు. బీసీ వ్య‌క్తి సీఎం అయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, విద్య, ఉద్యోగాలు, ఉపాధి, వైద్యం వంటి అన్ని రంగాల్లో బీసీలకు సముచిత వాటా లభించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీ అమలు కాలేదని విమర్శించిన ఆయన, బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సమావేశంలో ముఖ్య సలహాదారు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ పాత పది జిల్లాల్లో బీసీ ఐక్యవేదిక కార్యవర్గాలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని గ్రామస్థాయికి విస్తరించాలని సూచించారు. సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో బీసీల అభివృద్ధే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు ఓ. నర్సింహులు, యాదవ సంఘం అధ్యక్షుడు ఐలేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ ముదిరాజ్, హరికృష్ణ చారి, నర్సింగ్ ముదిరాజ్, సాయిలు, వెంకటేశ్వర్లు, నర్సింగ్ రావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here