శిల్పారామంలో డా. నటరాజ రామకృష్ణకు ఘన నృత్యాంజలి

శేరిలింగంప‌ల్లి, జూన్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ప్రముఖ నృత్యాచార్యులు కళాప్రపూర్ణ కీర్తిశేషులు డాక్టర్ నటరాజ రామకృష్ణ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక నృత్యాంజలి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ భాస్కర డాన్స్ అకాడమీ గురువు డి. సాత్విక ఆధ్వర్యంలో డాక్టర్ కళాకృష్ణ, కళారత్న ఉమా మహేశ్వర్ పాత్రుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రనాట్యం, పేరిణి నృత్య రూపకాలతో కళాకారులు నృత్య నీరాజనం అర్పించారు. ఈ సందర్భంగా కుంభహారతి, వినాయక కౌతం, కృష్ణయ్య జన్మించే, శివ కైవారం, నవజనార్ధన పారిజాతం, త్రిపురసంహార శబ్దం, సంధ్య సమయం తదితర విశిష్ట నృత్య అంశాలను ప్రదర్శించారు. దాదాపు 80 మంది కళాకారులు పాల్గొని తమ అద్భుత నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయ నృత్య కళారూపాల పరిరక్షణకు డాక్టర్ నటరాజ రామకృష్ణ చేసిన సేవలను ఈ సందర్భంగా వక్తలు స్మరించుకున్నారు. కార్యక్రమం కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here