శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మన చెరువు–మన అందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వ్యర్థాల తొలగింపు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, వాకర్స్ క్లబ్ సభ్యులు, కాలనీవాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ గుర్నాధం చెరువు చుట్టూ ఉన్న ముళ్లకంపలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను కాలనీవాసులు, యువత స్వచ్ఛందంగా తొలగించడం అభినందనీయమని అన్నారు. చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, వాటి పరిరక్షణలో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చెరువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేసిన ఆయన, మన పరిసరాల్లోని చెరువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. చెరువులు కనుమరుగవడానికి ప్రజల నిర్లక్ష్య వైఖరి కూడా ఒక కారణమని పేర్కొన్నారు.

చెరువులు, కుంటలను మన జీవితంలో విడదీయరాని భాగంగా భావించినప్పుడే వాటి రక్షణ సాధ్యమవుతుంది. ప్రకృతి సంపదను కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం అని గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులు చైతన్య, రాము, గుర్నాధం చెరువు పరిసర ప్రాంతాల కాలనీవాసులు, వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.





