ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, జూలై 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలతోపాటు పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు విశేష స్పందన లభించింది. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ దీక్షకు మద్దతు ప్రకటించి ఆర్. కృష్ణయ్యతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులను నిలిపివేసి పథకాన్ని బలహీనపర్చే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి, గతంలో అమలులో ఉన్న విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆర్. కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ దీక్షా శిబిరాన్ని సందర్శించి తన మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మేదరి మహేంద్ర సంఘం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కొంటు ముకుందం, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ కులాల సంఘాల ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సాయిలు, బీసీ యువజన నాయకుడు భేరి చంద్రశేఖర్ యాదవ్‌తోపాటు బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here