శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): ఆహార భద్రత, ప్రజారోగ్యం, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో నమోదైన ఆహార వ్యాపార సంస్థల నమోదు, పర్యవేక్షణ, నిర్వహణకు సంబంధించి స్విగ్గీ, జొమాటో సంస్థలకు పలు ఆదేశాలు జారీ చేసింది. సీఎంసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చెల్లుబాటు అయ్యే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ తో పాటు సీఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఆహార వ్యాపార సంస్థలను మాత్రమే ప్లాట్‌ఫామ్‌లలో నమోదు చేయాలని, లైసెన్స్ గడువు ముగిసిన, సస్పెండ్ అయిన, రద్దైన లేదా సీఎంసీతోపాటు ఇతర అధికార సంస్థలు డీ-లిస్ట్ చేయాలని ఆదేశించిన సంస్థలను వెంటనే ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది.

ఆహార నాణ్యత, పరిశుభ్రత రేటింగ్స్, వినియోగదారుల సమీక్షలకు సంబంధించి అనుసరిస్తున్న ప్రమాణాలు, విధానాలను పారదర్శకత కోసం సీఎంసీకి సమర్పించాలని సూచించింది. అలాగే సమాచార మార్పిడి, తనిఖీలు, కంప్లయన్స్ నివేదికలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి అధికారిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వినియోగదారులు ఇచ్చే ప్రతికూల సమీక్షలు, రేటింగ్స్‌ను తొలగించడం, మార్చడం లేదా దాచిపెట్టకూడదని స్పష్టం చేసింది. అవసరమైన సందర్భాల్లో మాత్రమే వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ విధానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్లాట్‌ఫామ్‌లో నమోదైన ప్రతి ఆహార సంస్థకు చెందిన కచ్చితమైన జియో-లొకేషన్‌ను ధ్రువీకరించి, అనుమతి పొందిన నమోదిత ప్రాంగణం నుంచే ఆహారం తయారు చేసి డెలివరీ అవుతున్నట్లు నిర్ధారించాలని సూచించింది. అలాగే ప్రతి సంస్థ వద్ద చెల్లుబాటు అయ్యే సీఎంసీ ట్రేడ్ లైసెన్స్ ప్రదర్శన ఉండేలా చూసి, దాని చెల్లుబాటును నిరంతరం పరిశీలించాలని ఆదేశించింది.
సీఎంసీ పరిధిలో తమ ప్లాట్‌ఫామ్‌లలో నమోదైన అన్ని ఆహార వ్యాపార సంస్థల వివరాలతో కూడిన వివరణాత్మక కంప్లయన్స్ నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని స్విగ్గీ, జొమాటో సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్, జీహెచ్‌ఎంసీ చట్టం-1955తోపాటు ఇతర మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సృజన హెచ్చరించారు.





