కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ లో నెలకొన్న సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా, ప్రజలకు మేలు చేకూర్చేలా శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. సోమవారం డివిజన్ లోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకు సాయిరాం స్కూల్ 3వ నంబరు వీధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగపు అధికారి డిప్యూటీ ఇంజనీర్ రమేష్, కాంట్రాక్టర్ నరసింహ, స్థానిక నాయకులతో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. సాయిరాం స్కూల్ నుండి 3వ నంబర్ వీధి రైల్వే ట్రాక్ వరకు ఉన్న ఓపెన్ నాలా పూడిక తీయించి, నాలా విస్తరణగావించి, నాలా ఎత్తును పెంచటం జరుగుతున్నదని తెలియజేశారు. ఓపెన్ నాలా పనులు పూర్తి అవ్వగానే అంతర్గత రోడ్ల పనులు మొదలుపెట్టి త్వరిత గతిన పూర్తి చెయ్యటానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. మౌలిక వసతులను ఏర్పాటు చేసే క్రమంలో ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేసే దిశగా పనులను చేయిస్తున్నట్టు తెలిపారు. తెరాస నాయకులు సయ్యద్ ఉస్మాన్, పప్పు భాయ్, యూత్ నాయకులు నసీరుద్దీన్, రఫీ, జహంగీర్, బస్తీ వాసులు పాల్గొన్నారు.