శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రస్తుతం సమాజంలో ప్రజలకు అందుబాటులో లేని విద్య, వైద్య దోపిడీని ప్రభుత్వాలు చట్టాల ద్వారానే నియంత్రించాలని, ప్రభుత్వాలు ఈ దోపిడీ నివారించే వరకు విద్యార్థులు, యువత మరిన్ని పోరాటాలు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు అన్నారు. మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవంలో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ లో AIFDY -AIFDS రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ ప్రారంభానికి ముందు చాకలి ఐలమ్మ, ఓంకార్ చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో కూడా ఆ దేశ ప్రజలకు ఉచితంగా విద్య, వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నాయని అన్నారు. మన దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవ చేసింది ఏమీ లేదని, ప్రజలు ఏదైనా అనారోగ్యాలకు గురైతే మంత్ర తంత్రాలను జపించే విధానాన్ని బోధిస్తుందని అన్నారు.

విద్యలో పూర్తిగా కాషాయీకరణను చొప్పించి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజలకు దూరం చేసే మనువాద పాలసీని తెచ్చిందని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 31 నుండి 52 వరకు అమలు చేస్తే ప్రజలు ఉద్యమించవలసిన అవసరం ఉండదని గుర్తు చేశారు. అలాకాకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ప్రాథమిక హక్కులను కూడా ప్రజలకు చెందకుండా బిజెపి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. రాష్ట్రంలో కూడా విద్య వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తూ కార్పొరేట్, పెట్టుబడిదారులకు వ్యాపార సరుకుగా ప్రభుత్వాలు మార్చాయని అన్నారు. నాటి నుంచి విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పు రాష్ట్రంలో రాలేదని అన్నారు. వైద్యం ప్రజలకు అందుబాటు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ బలపడేందుకు ప్రభుత్వం ప్రోత్సాకాలు పెరిగాయని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా విద్యా కంట్రోల్ బోర్డ్ ఏర్పాటు చేసినట్లే వైద్యానికి కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని గుర్తు చేశారు.
సామాన్యులకు అందుబాటులో లేకుండా వైద్యం ఉందని ప్రైవేటు దోపిడిని అరికట్టాలంటే ఒకే విధమైన ఫీజ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇది విద్యా వైద్యం రంగాలలో ప్రైవేటు యాజమాన్యానికి ఉండాలని ప్రతిపాదించారు. పూర్తిగా పేద సామాన్య మధ్యతరగ ప్రజలకు విద్య వైద్యం అందాలంటే ప్రభుత్వం విద్య వైద్య దోపిడి నియంత్రణ చట్టం చేయాలని దాని ద్వారానే దశలవారీగా ఈ రంగాల ప్రైవేటీకరణను నియంత్రించి కాలక్రమంలో పూర్తిగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించే దిశగా మారుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు పూనుకునే వరకు యువత విద్యార్థులు మరిన్ని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఏఐఎఫ్ డివై జాతీయ సహాయ కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ ఓంకార్ ప్రజలకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అందాలని చట్టసభలలో తన గొంతు వినిపించారని అన్నారు. ఆయన శతజయంతి వార్షికోత్సవంలో భాగంగా ప్రజలకు సంబంధించి ఓంకార్ ప్రతిపాదించిన అనేక అంశాలను నేటి ప్రభుత్వాల ముందుకు ఉంచడానికి యువత, విద్యార్థులు తీసుకున్న ఈ కార్యక్రమం పూర్తిగా ప్రజా కార్యక్రమమేనని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాల కన్నా ఉచిత విద్యా, వైద్యం అందించే వరకు పోరాడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఏఐఎఫ్ డివై రాష్ట్ర అధ్యక్షుడు కర్ర రాజిరెడ్డి, ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళిల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐఎఫ్ డివై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్, ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వసకుల మట్టయ్య, ఏ ఐ డి ఎస్ ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నితీష్, పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, పి డి ఎస్ యు జార్జి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్ నాగేశ్వరరావు, పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాకేష్, ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతుగంటి కాశి, సహాయ కార్యదర్శి జబ్బర్ నాయక్, వి భరత్, ఏఐఎఫ్ డివై రాష్ట్ర కమిటీ సభ్యులు దశరథ్ నాయక్, ఎండి సుల్తానా బేగం, డి. శ్రీనివాసులు, ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, ఇంకా వేణుమాధవ్, జి.శివాని, రామ్మోహన్, నవీన్, పి.శ్యాంసుందర్, వెంకటేష్, ఆశీర్వాదం, కార్తీక్, మల్లేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.





