దీప్తిశ్రీనగర్‌లో ప్రభుత్వ శిఖం భూమి వివాదం.. అనుమతులు రద్దు చేయాలని జనం కోసం డిమాండ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ లేఅవుట్‌లో ప్రభుత్వ శిఖం భూమి ఆక్రమణ, రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులపై జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే నంబర్ 151కు సంబంధించిన భూమిని పరిశీలించి, అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని జోనల్ కమిషనర్ (ZC), డిప్యూటీ కమిషనర్ (DC)లను కోరారు. భాస్కరరెడ్డి తెలిపిన‌ వివరాల ప్రకారం.. దీప్తిశ్రీనగర్‌లోని సర్వే నంబర్ 151 ప్రభుత్వ శిఖం భూమిని సుమారు 30 ఏళ్ల క్రితం లేఅవుట్ చేసిన సమయంలో సర్వే నంబర్ 150గా చూపించి రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో దీప్తిశ్రీనగర్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కోట్ల రూపాయలు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఈ భూమిపై బిల్డర్ పవన్ కుమార్ 2023లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొంది నిర్మాణం ప్రారంభించారని తెలిపారు.

అయితే 2020లోనే జనం కోసం చేసిన ఫిర్యాదు మేరకు అప్పటి ఆర్డీవో చంద్రకళ సర్వే చేయించి, భూమి సర్వే నంబర్ 151కు చెందిన ప్రభుత్వ శిఖం భూమిగా నిర్ధారించినట్లు భాస్కరరెడ్డి తెలిపారు. 2023లోనూ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని, నిర్మాణాన్ని అడ్డుకునే చర్యలు చేపట్టినప్పటికీ కొందరు రెవెన్యూ సిబ్బంది బిల్డర్‌కు సహకరించడంతో నిర్మాణం చివరి దశకు చేరిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వాల్టా చట్టం, స్వాధీనం నోటీసులకు సంబంధించి శ్రీనివాసరావు, బిల్డర్ పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. WP No.4217 of 2026పై ఫిబ్రవరి 10న హైకోర్టు సర్వే నిర్వహించి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కేసును ముగించినట్లు పేర్కొన్నారు. తదుపరి రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో నిర్మాణం ఉన్న ప్రాంతం సర్వే నంబర్ 151లోని ప్రభుత్వ శిఖం భూమిగా, అందులో 372.5 గజాలు చెరువు శిఖంగా తేలినట్లు భాస్కరరెడ్డి తెలిపారు. మే 13, 2026న నోటీసు తీసుకోకపోవడంతో నిర్మాణానికి నోటీసు అంటించి పంచనామా పూర్తి చేసినట్లు గిర్దావర్ నివేదికలో పేర్కొన్నారని చెప్పారు.

అయితే తహసీల్దార్ కార్యాలయ సర్వేపై నమ్మకం లేదంటూ కబ్జాదారు ఏడీ సర్వేకు దరఖాస్తు చేసుకోవడం, అనంతరం వచ్చిన ఏడీ సర్వే ట్రూ కాపీని సర్వే నంబర్ 150 పట్టా భూమిగా పేర్కొంటూ తహసీల్దార్‌కు సమర్పించడం అనుమానాస్పదంగా ఉందని జనం కోసం ఆరోపించింది. ఈ వ్యవహారంపై జూలై 20, 2026న కలెక్టర్, రంగారెడ్డి ఏడీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. తమ నిబంధనల ప్రకారం సర్వే జరగలేదని పేర్కొంటూ ఏడీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌కు లేఖ వచ్చినప్పటికీ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకుండా వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని భాస్కరరెడ్డి ఆరోపించారు. నిర్మాణ పనులు వేగవంతం కావడంతో తహసీల్దార్ మహిపాల్ రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ చర్యలు మందగించాయని విమర్శించారు. రెవెన్యూ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన బ్యానర్‌ను కూడా కబ్జాదారులు తొలగించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కబ్జాదారు మరోసారి హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఆర్డర్ పొందడం చర్చనీయాంశంగా మారిందన్నారు.

ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సొసైటీ, సంబంధిత కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. స్టేటస్‌కో నిర్మాణానికి మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులకు అందజేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయ వైఫల్యాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here