నెక్నాంపూర్ బేబీ పాండ్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాబోయే వినాయక చవితి నవరాత్రుల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న వినాయక నిమజ్జన ఉత్సవాల కోసం నెక్నాంపూర్ బేబీ పాండ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ డా. జి. సృజన, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ సంయుక్తంగా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్ల పురోగతిని అధికారులు సమీక్షించారు. అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ఘాట్ల వద్ద పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు హైమాస్ట్ లైట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చెరువు పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

అలాగే నిమజ్జన ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో అడిషనల్ కమిషనర్ (శానిటేషన్), శేరిలింగంపల్లి జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, నార్సింగి డిప్యూటీ కమిషనర్‌తో పాటు నార్సింగి సర్కిల్ ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. నెక్నాంపూర్ చెరువు తనిఖీ అనంతరం కమిషనర్ డా. సృజన నేతృత్వంలోని అధికారుల బృందం మణికొండ వార్డు 127లోని చిత్రపురి కాలనీలో కొనసాగుతున్న మోడల్ రోడ్డు పనులను పరిశీలించింది. మౌలిక వసతులు, రోడ్డు నిర్వహణ పనుల పురోగతిని సమీక్షించారు. రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా అవసరమైన మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here