శేరిలింగంపల్లిలో డ్రైనేజీ వ్యవస్థపై సమగ్ర సమీక్ష

శేరిలింగంప‌ల్లి, జూన్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోన్‌లో డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసి వర్షాకాలంలో వరద ముంపు సమస్యలను నివారించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు. మంగళవారం CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు, NCPE కన్సల్టెంట్ ప్రతినిధులతో కలిసి డ్రైనేజీ ప్యాటర్న్, ఫ్లో హైడ్రాలిక్స్‌పై విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జోన్ పరిధిలోని ప్రధాన, అనుబంధ నాలాల ప్రస్తుత పరిస్థితి, నీటి ప్రవాహ సామర్థ్యంపై NCPE సమర్పించిన సాంకేతిక నివేదికను పరిశీలించారు. రుతుపవనాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ, వరద ముంపు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులు చర్చించారు.

ప్రస్తుత డ్రైన్ల సామర్థ్యం, నీటి ప్రవాహ వేగం, డ్రైనేజీలో ఉన్న అవరోధాల తొలగింపు వంటి అంశాలపై ఇంజనీరింగ్ అధికారులకు జోనల్ కమిషనర్ పలు సూచనలు చేశారు. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టార్మ్ వాటర్ డ్రైన్ల అభివృద్ధి, మిస్సింగ్ లింక్‌ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీని వేగవంతం చేయాలని NCPE ప్రతినిధులను ఆదేశించారు. ఈ సందర్భంగా నారాయణ్ అమిత్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి జోన్‌లో వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. NCPE నివేదిక ఆధారంగా తక్షణ, దీర్ఘకాలిక పనులను గుర్తించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో చీఫ్ ఇంజనీర్ శ్రీలక్ష్మి, ఎస్‌ఈ శంకర్, ఈఈలు, ఏసీపీలు, డిప్యూటీ ఈఈలు, NCPE సాంకేతిక బృందం పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here