మహదేవపురం యానిమల్ కేర్ సెంటర్ అభివృద్ధికి సీఎంసీ కసరత్తు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్‌లో జంతు సంరక్షణ సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్ (హెల్త్ అండ్ శానిటేషన్), ఇంజినీరింగ్, వెటర్నరీ శాఖల అధికారులతో కలిసి సీఎంసీ కమిషనర్ సృజ‌న గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహదేవపురం యానిమల్ కేర్ సెంటర్‌ను సందర్శించారు. కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలను అధికారులు పరిశీలించారు.

యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ సామర్థ్యాన్ని పెంచి మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ అధికారులను ఆదేశించారు. సీఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కుక్కలకు మెరుగైన సేవలు అందించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను విస్తరించాలని సూచించారు. అలాగే యానిమల్ కేర్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని పెట్ థీమ్ పార్క్‌గా అభివృద్ధి చేసే అవకాశాలను అధికారులు పరిశీలించారు. ఇందులో పెట్ హాస్టల్స్, కేఫెటీరియా, పెట్ స్పోర్ట్స్‌తో పాటు ఇతర కార్యకలాపాల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలను పరిశీలించారు.

యానిమల్ కేర్ సెంటర్‌కు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులు పూర్తయితే జంతు సంరక్షణ సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు పెంపుడు జంతువులకు అనుకూలమైన వాతావరణం అందుబాటులోకి రానుంది. దీంతో సైబరాబాద్‌ను మరింత పెట్-ఫ్రెండ్లీ నగరంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు ముందుకు సాగనున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here