శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): అనధికార నిర్మాణాల నియంత్రణ, భవన నిర్మాణ నిబంధనల అమలును నిర్ధారించే దిశగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మూడు జోన్ల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతున్నారు. నేటి ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో 15 అనధికార నిర్మాణాలను గుర్తించగా, 17 కూల్చివేతలు చేపట్టారు. అలాగే 9 నోటీసులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలించిన అనంతరం సంబంధిత కేసుల్లో తదుపరి చర్యలు చేపట్టారు.

జోన్ల వారీగా చేపట్టిన కూల్చివేతల్లో శేరిలింగంపల్లి జోన్లో 5, కూకట్పల్లి జోన్లో 4, కుత్బుల్లాపూర్ జోన్లో 8 నిర్మాణాలు ఉన్నాయి. గుర్తించిన అనధికార నిర్మాణాలపై నిరంతర క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రతి కేసును నిర్దేశిత విధానాల ప్రకారం తదుపరి చర్యలకు తీసుకెళ్లాలని సీఎంసీ కమిషనర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ చర్యల అమలులో అన్ని బృందాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భవన నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చూడటంతో పాటు, అనధికార నిర్మాణాలపై తనిఖీలు, కూల్చివేతలు, నోటీసుల జారీ వంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు నిరంతరం కొనసాగుతాయని సీఎంసీ స్పష్టం చేసింది.





