హైదరాబాద్ పాలసీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న CMC కమిషనర్ సృజ‌న

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్‌లో జరిగిన హైదరాబాద్ పాలసీ కాన్‌క్లేవ్: ది ఇండియన్ ఎరా (Hyderabad Policy Conclave: The Indian Era) లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజ‌న పాల్గొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు జరుగుతున్న ఈ కాన్‌క్లేవ్, విధాన రూపకల్పన, అమలులో అత్యుత్తమ పద్ధతులు, సంస్థాగత అభ్యాసంపై చర్చించే ఒక జాతీయ వేదిక కాగా దీనికి దేశవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు, నిపుణులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు హాజరయ్యారు.

వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (WRI) సహకారంతో నిర్వహించిన షిఫ్ట్ ట్రాన్స్‌పోర్ట్: డేటా-డ్రివెన్ మొబిలిటీ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్-రెడీ సిటీస్ అనే అంశంపై జరిగిన ప్లీనరీ సెషన్‌లో కమిషనర్ ప్రసంగించారు. నగర రవాణా ప్రణాళికలో డేటా ఆధారిత పద్ధతుల వినియోగం, రోడ్డు భద్రత, రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడం, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా స్థిరమైన పట్టణ రవాణా వ్యవస్థలను ప్రోత్సహించడం, సైబరాబాద్‌లో ఎదురవుతున్న పట్టణ రవాణా సవాళ్లు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, నగర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో సాంకేతిక పరిష్కారాల ప్రాముఖ్యతపై కమిషనర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కాన్‌క్లేవ్‌లో మరిన్ని కీలక అంశాలపై చర్చలు జరిగాయి. స్థిరమైన పట్టణ అభివృద్ధి (Sustainable Urban Development), పాలన, విధాన రూపకల్పనలో నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, రవాణా ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా, పట్టణ పాలనలో సరికొత్త సాంకేతికతను, స్థిరమైన పద్ధతులను అవలంబించడంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన నిబద్ధతను చాటుకుంద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here