శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతిరోజూ ఒక వార్డు (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మంగళవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన కూకట్పల్లి జోన్ పరిధిలోని మాదాపూర్ సర్కిల్ అంజయ్య నగర్ వార్డులో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ సిబ్బందితో కలిసి వైట్‌ఫీల్డ్ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక పౌర సమస్యలను సమీక్షించడంతో పాటు, నివాసితులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి విస్తరణ, ఫుట్‌పాత్ అభివృద్ధి పనులను చేపట్టాలని ఆదేశించారు. ట్రెండ్‌సెట్ జయభేరి సమీపంలోని బాటిల్‌నెక్ (ఇరుకు ప్రాంతం) వద్ద ఉన్న శ్మశానవాటిక అభివృద్ధిని సమీక్షించారు.

ఫ్లైఓవర్ కింద ఖాళీ స్థలంలో ఒక ప్రత్యేక థీమ్ ఆధారిత ప్లే ఏరియాను (Themed Play Area) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వీధి వ్యాపారులు నో బిన్ – నో ట్రేడ్ (డస్ట్ బిన్ లేకపోతే వ్యాపారం లేదు) విధానాన్ని కచ్చితంగా పాటిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. గచ్చిబౌలి వైపు వెళ్లే రహదారి విస్తరణకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. నో-హాంకింగ్ జోన్లు (హారన్ కొట్టకూడదు) ఏర్పాటు చేయడం, రేసింగ్ కార్యకలాపాలను అరికట్టడం, స్కూల్ బస్సుల భద్రతను పర్యవేక్షించడం, జంక్షన్లు, మలుపుల వద్ద మెరుగుదల పనులను సమీక్షించారు. గుంతల మరమ్మత్తులు (Pothole Repairs), ప్యాచ్‌వర్క్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రమాదకర మలుపుల వద్ద బ్లైండ్ స్పాట్ మిర్రర్లను ఏర్పాటు చేయాలన్నారు.
వీధి దీపాలు అన్నీ సరిగ్గా వెలిగేలా చూడాలని అధికారులకు సూచించారు. వేలాడుతున్న కేబుల్ కట్టలను (Hanging Cables) తొలగించాలని ఆదేశించారు. రోడ్లపై దీర్ఘకాలంగా పార్క్ చేసి ఉన్న వాహనాలను గుర్తించి, వాటిని క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. జలమండలి (HMWSSB) అధికారులతో కలిసి డ్రైనేజీ సమస్యలపై సంయుక్త తనిఖీ నిర్వహించి, సమస్యల త్వరిత పరిష్కారానికి ఆదేశించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు సెంట్రల్ మీడియన్ అభివృద్ధి చేయాలని సూచించారు. పారిశుధ్యం, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ పద్ధతిని, దాని ప్రభావాన్ని సమీక్షించారు. చెత్త నిల్వ ఉండే ప్రాంతాలను (GVPs) గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ పనుల అమలును పర్యవేక్షించారు.





