బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర పార్టీలు ద్వంద వైఖరిని విడనాడాలి: తుడుం అనిల్ కుమార్

శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ బీసీలను అణచి వేస్తూ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పాలక పార్టీలు తమ ద్వంద్వ‌ విధానాలను విడనాడాలని ఎం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ రమేష్ డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణ ఆధిపత్య పాలక పార్టీల వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరుతూ చేపట్టిన రాష్ట్ర బంద్‌లో భాగంగా మియాపూర్ బస్సు డిపో ఎదుట ఎం సి పి ఐ (యు) పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బంద్ పాల్గొన్న యం సి పి ఐ( యు) నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రంలోని బిజెపి బీసీల బంద్‌కు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నప్పటికీ కేవలం 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వటానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్, జీవో నెంబర్ 9 లు తీసుకువచ్చి చట్ట పరిధిలో అమలు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ప్రజలు పాలక పార్టీల ద్వంద్వ‌ విధానాలను గమనించి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యం సిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు వి తుకారాం నాయక్, పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్ నాయక్, సభ్యుడు బి నారాయణ, మియాపూర్ డివిజన్ నాయకులు దేవనూరి నర్సింహా, యం రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here