శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో నిజమైన దోషి బిజెపి అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సిపిఐ శ్రేణులు కొండాపూర్ హైటెక్స్ రోడ్డు వద్ద నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో ఆమోదింపబడిన బిల్లును కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉంచుతూ బిజెపి ద్వంద్వ విధానాలు అవలంబిస్తూ రాజకీయ ముసుగులో బీసీలను మోసం చేస్తుందని, బీజేపీ బండారం బయటపెట్టి ప్రజలకు బిజెపి నిజస్వరూపం బయటపెట్టాలని ఆయన ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమిళనాడు తరహాలో అప్పుడు అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వం బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి బిల్లును గవర్నర్ వద్ద ఆమోదింపజేసుకొని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా అప్పుడు అధికారంలో ఉన్న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆ బిల్లుకు ఆమోదం తెలిపి బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పటికైనా బిజెపి ఆడుతున్న దొంగనాటకాలు ఆపి రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాని కోసం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నూతన ప్రజా ప్రభుత్వం బీసీ బిల్లు కోసం అఖిలపక్ష పార్టీల నాయకులను కలుపుకొని ఢిల్లీ వేదికగా ఉద్యమించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ కార్యదర్శి ఎస్ కొండలయ్య, ఎస్ నారాయణ, హఫీజ్‌పేట కార్యదర్శి జెటి శ్రీనివాస్, ఏం వెంకటేష్, కే శివకుమార్, జె.ధర్మ తేజ, టి నితీష్, టి గణేష్ పాల్గొన్నారు.






