కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి.. 420 అడుగుల ఫ్లెక్సీతో నిరసన

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు ఆ పార్టీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు. మాజీ కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రకాష్‌నగర్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కనీస మౌలిక సదుపాయాల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తాగునీటి సరఫరా సమయం తగ్గిపోయిందని, కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో వీధి విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బస్తీ దవాఖానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. వైద్యులు, సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదని, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో పాటు రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు సక్రమంగా జరగడం లేదని అన్నారు. దీంతో పేదలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

బస్తీ దవాఖానాలను వెంటనే పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, వైద్యులు, సిబ్బందికి జీతాలను సకాలంలో చెల్లించాలని, అవసరమైన మందులు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిందని, అయితే వెయ్యి రోజులు గడిచినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ కక్షలు, ప్రచారాలకు స్వస్తి పలికి ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, లక్ష్మీనారాయణ, మోలుగు ఆనంద్ రావు, అశ్వంత్, బొట్టు విష్ణుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here