నవంబర్ 27ను బాల్య, బాల్యదశ, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటించిన ఐరాస

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బాల్య వివాహాలు, బాలల దోపిడీ, హానికర సామాజిక ఆచారాల నిర్మూలనకు నవంబర్ 27ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయాన్ని స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ (స్కోప్) స్వాగతించింది. బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమానికి ఈ నిర్ణయం చారిత్రాత్మక గుర్తింపని సంస్థ పేర్కొంది.

స్కోప్ అధ్యక్షుడు డా. బండి సాయన్న మాట్లాడుతూ.. భారతదేశం నుంచి వినిపించిన స్వరం నేడు ప్రపంచ సంకల్పంగా మారింద‌న్నారు. నవంబర్ 27, 2024న భారత ప్రభుత్వం ప్రారంభించిన బాల వివాహ్ ముక్త్ భారత్ ప్రచారానికి ఇప్పుడు ఐరాస నిర్ణయంతో అంతర్జాతీయ ప్రాధాన్యత లభించిందని తెలిపారు. ఇది సంబరాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామాలు, సమాజాలు, కుటుంబాల స్థాయిలో కార్యాచరణకు దారితీయాలని ఆయన అన్నారు. తెలంగాణలోని జనగామ, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 2023 నుంచి సెప్టెంబర్ 2026 వరకు 3,604 బాల్య వివాహాలను నివారించడంలో స్కోప్ కీలకంగా పనిచేసిందని సంస్థ తెలిపింది. అవగాహన కార్యక్రమాలు, సమాజ సమీకరణ, ప్రభుత్వ అధికారులు, పోలీసులతో సమన్వయం, చట్టపరమైన జోక్యాలు, బాలల రక్షణ వ్యవస్థల సహకారంతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. 3,604 అనేది కేవలం ఒక సంఖ్య కాదు.. ప్రతి సంఖ్య వెనుక ఒక బాల్యం, ఒక భవిష్యత్తు ఉంది. ఆ బాల్యం, భవిష్యత్తును రక్షించాం అని డా. సాయన్న పేర్కొన్నారు.

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవం కోసం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జెఆర్‌సీ) వ్యవస్థాపకుడు భువన్ రిభు నాయకత్వంలో కొనసాగిన ఉద్యమాన్ని స్కోప్ అభినందించింది. మార్చి 2026లో ఐరాసలో భువన్ రిభు చేసిన ప్రసంగం అనంతరం సియెర్రా లియోన్ నాయకత్వంలో భారత్ సహా 67 దేశాల మద్దతుతో నవంబర్ 27ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగిందని తెలిపింది. జెఆర్‌సీ భాగస్వామ్య సంస్థలు దేశవ్యాప్తంగా బాలల రక్షణ, బాల్య వివాహాల నివారణకు పనిచేస్తున్నాయని, వాటి సమిష్టి కృషితో 5.5 లక్షలకు పైగా బాల్య వివాహాల నివారణకు సహకారం అందించినట్లు సంస్థ పేర్కొంది. బాల్య వివాహాల ప్రాబల్యం తగ్గుతున్నప్పటికీ సవాలు ఇంకా కొనసాగుతోందని స్కోప్ తెలిపింది. ప్రతి బాలబాలికకు బాల్యాన్ని ఆస్వాదించే, విద్యను కొనసాగించే, భద్రతతో ఎదిగే హక్కు ఉంది. నవంబర్ 27 సామూహిక కార్యాచరణకు దినంగా మారాల‌ని డా. బండి సాయన్న పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here