ప్ర‌ణామ్ హాస్పిట‌ల్స్‌లో మదర్ & చైల్డ్ కేర్ సేవ‌లు ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మదీనాగూడలోని ప్రణామ్ హాస్పిటల్స్ నూతన భవనంలో మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 100 పడకల మదర్ & చైల్డ్ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించారు. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. డాక్టర్ మనీష్ గౌర్ ఆధ్వర్యంలోని బృందం అన్ని ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని అద్భుతంగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. మూడు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణతో సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఇన్ఫెక్షన్ నియంత్రణకు అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ప్రణామ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గౌర్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఇప్పటికే తమ ఆసుపత్రిలో 150 పడకల మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహిళలు, చిన్నారులకు మరింత ప్రత్యేకమైన, అత్యున్నత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నూతనంగా 100 పడకల మదర్ & చైల్డ్ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. కొత్త ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లతోపాటు ఐసీయూలు, ఎన్ఐసీయూ, పీఐసీయూ, మెటర్నల్ ఐసీయూ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లగ్జరీ సూట్ రూమ్‌లను కూడా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దామని వెల్లడించారు.

సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రతి కుటుంబానికి సొంత కుటుంబ వైద్యుడిలా ఆత్మీయ భరోసా కల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని డాక్టర్ మనీష్ గౌర్ తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల తరహా అధిక భారం లేకుండా ‘ఫ్యామిలీ హాస్పిటల్ గా రోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో టైర్-2, టైర్-3 నగరాలకు సైతం తమ ఆసుపత్రి నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here