శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని గంగారం మెయిన్ రోడ్ నుండి హుడా కాలనీ ఫేజ్–2 సాయిబాబా దేవాలయం వరకు, అలాగే సాయిబాబా దేవాలయం నుండి లింగంపల్లి పాత రైల్వే బ్రిడ్జ్ వరకు ఉన్న BT రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో స్థానిక ప్రజలు భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ రహదారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వాహనదారులు అనేక ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలకు నష్టం కలగడంతోపాటు వాహనదారులకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయా రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఎంత విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని పవన్ కుమార్ అన్నారు. రహదారులు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జాంలలో ఇరుక్కుంటున్నారని అన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఇప్పటికైనా స్పందించి రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.

ఈ నేపథ్యంలో బీజేపీ OBC రాష్ట్ర నాయకుడు బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు పవన్ కుమార్, బీజేపీ నాయకులు పాలం శ్రీనివాస్, శివ ముదిరాజ్, నవీన్, చందు తదితరులు చందానగర్ GHMC కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని GHMC అసిస్టెంట్ కమిషనర్ కి మెమోరాండం సమర్పించారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రహదారి పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.





