శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా ప్రాంతంలో హోనర్ ఆక్వాంటిస్, బ్రిక్స్ స్కైవుడ్స్ సమీపంలో నూతనంగా నిర్మించిన బస్‌స్టాప్‌ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి, బర్కత్‌పుర డిపో మేనేజర్ ఆర్. మంజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ బస్‌స్టాప్ ఏర్పాటు వలన పరిసర ప్రాంత నివాసితులకు రవాణా సౌకర్యాలు మరింత సులభతరం కానున్నాయని, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయుక్తమవుతుందని తెలిపారు. బస్‌స్టాప్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం షెడ్ నిర్మాణానికి తన వ్యక్తిగత నిధులు వెచ్చిస్తానని తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సు సర్వీసులను పెంచాలని, కొత్త రూట్లను ప్రవేశపెట్టాలని అభ్యర్థించారు. ఇందుకు మంజుల సానుకూలంగా స్పందించి ఆయా వినతులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ బస్ స్టాప్ ప్రారంభం స్థానిక ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటానికి ఒక మంచి ముందడుగని కార్పొరేటర్ పేర్కొన్నారు.

అనంతరం బ్రిక్స్ స్కైవుడ్స్ గేటేడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్‌లో నిర్వహించిన సమావేశానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోనర్ ఆక్వాంటిస్, బ్రిక్స్ స్కైవుడ్స్ నివాసితులు తమ ప్రాంతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన రహదారుల పనులు, పాత్ హోల్స్ మరమ్మత్తులు, ఓపెన్ నాలా కవరింగ్, లేక్ డెవలప్మెంట్, శ్మశాన వాటిక సుందరీకరణ, తాగునీటి వసతి మెరుగుదల, వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు, పారిశుధ్య పనులను మెరుగుపరచాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు. ఈ విషయాలపై వెంటనే స్పందించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోనర్ ఆక్వాంటిస్, బ్రిక్స్ స్కైవుడ్స్ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓపెన్ నాలా కవరింగ్, పాత్ హోల్స్ మరమ్మత్తులు, లేక్ డెవలప్మెంట్, శ్మశాన వాటిక సుందరీకరణ, డ్రైనేజ్ వ్యవస్థల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంత్ నాయక్, బ్రిక్స్ స్కైవుడ్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి,సెక్రెటరీ బి ఆర్ రెడ్డి, హోనర్ ఆక్వాంటిస్ ప్రెసిడెంట్ చిదంబరం, వైస్ ప్రెసిడెంట్ సందీప్, కమ్యూనిటీ సభ్యులు నవీన్, శంకర్, సీనియర్ నాయకులు గోపి నాయక్, రాజు నాయక్, సుమన్, నరసింహ, నర్సింగ్, ప్రకాశ్, రాథోడ్, శ్రీశైలం, హోనర్ ఆక్వాంటిస్, బ్రిక్స్ స్కైవుడ్స్ అపార్ట్మెంట్ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





