శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి BHEL పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1300 మంది విద్యార్థులు విద్యను అభ్యశిస్తున్నారని, జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల అని, కానీ ఈ కళాశాల సమస్యలకు నిలయంగా ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) రంగారెడ్డి జిల్లా కమిటీ కార్యదర్శి బి. శంకర్ అన్నారు. కాలేజీలో ఒకే భవనంలో ఇంటర్, డిగ్రీ తరగతులు షిఫ్టింగ్ పద్దతిలో కొనసాగుతున్నాయని, ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జూనియర్ వారికి, మధ్యాహ్నం 1నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిగ్రీ తరగతులు జరుగుతున్నాయని, ఇలా క్లాసులు ఉండటం ద్వారా మధ్యాహ్నం ఇంటర్ పూర్తి కావడం తో విద్యార్థులు తమ చదువులపై శ్రద్ద చూపడం లేదన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కువగా పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటారని, ఈ కాలేజీలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో ఉంటే విద్యార్థులు అన్ని రంగాల్లో ఆహ్లాదంగా ఉండటానికి ఆటలు పాటలు చదువుల్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిగ్రీ కళాశాలకు ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్ లో పోరాటం చేస్తామన్నారు.






