గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్, విద్యార్థి నాయకులు గత పద్నాలుగు రోజులుగా చేస్తున్న ఓబిసి సత్యాగ్రహానికి బిహెచ్ఈఎల్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఓబీసీ నాయకులు వారి సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఓబీసీ నాయకులు జి.రామ్ రాజ్ యాదవ్, ఎం.నాగమోహన్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు, బోధన, బోధనేతర ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, యూనివర్సిటీలో ఓబీసీ విద్యార్థులపై వివక్ష పూరిత వాతావరణం నెలకొందని, పరిశోధక, అధ్యాపక స్థానాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, డిసెంబరు నెలలోని ఎన్సిబీసి సిఫార్సులు అమలు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రత్యేక ఓబీసీ రిక్రూట్మెంట్ చేయాలని, ఓబీసీలకు ఫీజులలో రాయితీలు ఇవ్వాలని, ఈ విషయంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ వెంటనే కలుగజేసుకొని ఓబీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ నాయకులు ఎస్.బి.సంతోష్ కుమార్, తుకారాం, కార్యవర్గ సభ్యులు దీక్ష శిబిరాన్ని సందర్శించారు.