- ఎస్సీఎస్సీ, సైబరాబాద్ పోలీసులు, ఎండ్ నౌ సంస్థల ఆధ్వర్యంలో
”దిల్ సే.. సురక్షితమైన యువత కోసం డిజిటల్ లిటరసీ” ప్రోగ్రాం.. ప్రారంభం - తొలి విడతలో 100 మంది వాలంటీర్లకు శిక్షణ
- సమాజంలోని ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్న వాలంటీర్లు
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. గురువారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), సైబరాబాద్ పోలీసులు, ఎండ్ నౌ అనే ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ”దిల్ సే.. సురక్షితమైన యువత కోసం డిజిటల్ లిటరసీ” ప్రోగ్రాం..ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో ప్రజలు వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, దీంతో వారు ఆ తరహా మోసాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా యువతలో సైబర్ నేరాల పట్ల అవగాహన పెరుగుతుందని, వారు మరికొంత మందికి ఈ అంశంపై అవగాహన కల్పిస్తారన్నారు.
ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి మొదటి బ్యాచ్‌లో 100 మంది యువకులు స్వచ్ఛందంగా శిక్షణ పొందుతారని, వారికి ధ్రువపత్రాలను అందజేస్తామన్నారు. వారికి సైబర్ నేరాలు, సైబర్ భద్రత, సైబర్ బెదిరింపు, ఫేక్ న్యూస్, ఎఫెక్టివ్ సోషల్ మీడియా వాడకం, బేసిక్ సైబర్ లాస్, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ పై శిక్షణ ఇవ్వబడుతుందని అనంతరం వారు సమాజం, సంఘాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఇందులో వాలంటీర్‌గా ఎవరైనా నమోదు చేసుకోవచ్చని, చేసుకున్న వారికి శిక్షణ ఇస్తామని, అనంతరం ధ్రువ పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఆ తరువాత వారు మరికొంత మందికి ఆయా అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన వీడియో, పోస్టర్, వాలంటీర్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందాలనుకునేవారు crm@scsc.in అనే మెయిల్ ఐడీ లేదా 9177283831 అనే ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్, END NOW ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అనిల్ రాచమళ్ల, ఎస్బిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఫోరం కార్యదర్శి అభిషేక్ కుమార్, ఎస్సిఎస్సి వెంకట్ టంకసాల, పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది, 100 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.