ఆస్తి ప‌న్ను ఎగ‌వేసినందుకు బిల్డ‌ర్ మిరియాల రాఘ‌వ‌రావుపై చ‌ర్య‌లు తీసుకోవాలి: క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్‌కు చెందిన బిల్డ‌ర్ మిరియాల రాఘ‌వ‌రావు పెద్ద ఎత్తున ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డ్డార‌ని, వెంట‌నే ఆయ‌న నుంచి ప‌న్ను వ‌సూలు చేసి చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ జోన‌ల్ క‌మిష‌నర్ హేమంత్ బోర్ఖ‌డే, చందాన‌గ‌ర్ స‌ర్కిల్ డీసీ శ‌శిరేఖ‌కు జ‌నం కోసం స్వ‌చ్ఛంద సంస్థ అధ్య‌క్షుడు క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చందాన‌గ‌ర్ లో జాతీయ ర‌హ‌దారికి ఆనుకుని బిల్డ‌ర్ మిరియాల రాఘ‌వ‌రావు విజ‌య రాఘ‌వ చాంబ‌ర్స్ పేరిట బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించార‌ని, ఈ భ‌వంతికి గాను రాఘ‌వ‌రావు గ‌త 25 ఏళ్లుగా ల‌క్ష‌ల రూపాయ‌ల ఆస్తి ప‌న్ను చెల్లించ‌కుండా ఎగ్గొట్టార‌ని అన్నారు. అలాగే చందాన‌గ‌ర్‌లోని గౌత‌మిన‌గ‌ర్‌లో ఉన్న ఇంటి నం.2-49/1 నివాసాన్ని గృహ నివాసంగా అనుమ‌తి తీసుకున్నార‌ని, కానీ వాణిజ్య ప‌రంగా కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నార‌ని, ఈ నివాసానికి ల‌క్ష‌ల రూపాయ‌ల అద్దె వ‌సూలు చేస్తున్నార‌ని అన్నారు. దీనికి గాను కేవ‌లం కూ.4438 ఆస్తి ప‌న్ను చెల్లిస్తూ జీహెచ్ఎంసీని మోసం చేస్తున్నార‌ని అన్నారు. అలాగే చందాన‌గ‌ర్‌లో ఉన్న ఇంటి నం.6-60లోని మ‌రో నివాసానికి గాను కేవ‌లం రూ.13,556 ఆస్తి ప‌న్ను చెల్లించ‌డం అనుమానాస్ప‌దంగా ఉంద‌న్నారు. ఈ ఆస్తి ప‌న్నుల ఎగ‌వేత‌కు సంబంధించి మిరియాల రాఘ‌వ‌రావుకు ఇన్‌చార్జి ఏఎంసీ కృష్ణ స‌హ‌కారం అందిస్తున్నాడ‌ని ఆరోపించారు. క‌నుక వెంట‌నే మిరియాల రాఘ‌వ‌రావుతోపాటు కృష్ణ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఆస్తి ప‌న్ను స‌క్ర‌మంగా వ‌సూలు అయ్యేలా చూడాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here