ఒక్క పోలియో చుక్కే జీవితాంతం రక్షణ: కైతాపురం జితేందర్

శేరిలింగంప‌ల్లి, జూన్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రి సామాజిక బాధ్యత అని హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హఫీజ్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రి, వార్డు కార్యాలయం, హుడా కాలనీలోని విద్యావాణి హైస్కూల్, అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన పోలియో కార్యక్రమంలో స్థానిక అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కైతాపురం జితేందర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. ఒక చిన్న పోలియో చుక్క జీవితాంతం ఒక చిన్నారిని వికలాంగత్వం నుంచి కాపాడుతుంద‌ని అన్నారు. భారత్ ఇప్పటికే పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, అప్రమత్తతతో అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలతోపాటు పొరుగువారి, బంధువుల పిల్లలను కూడా సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎండా, వానా లెక్కచేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం సేవలందిస్తున్న వైద్యశాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, మారెళ్ల వెంకటేశ్వర్లు, బీజేపీ యువ మోర్చా డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, బీజేపీ నాయకులు నరసింహ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here