బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి: దుండ్ర కుమారస్వామి

శేరిలింగంప‌ల్లి, జూన్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశవ్యాప్తంగా బీసీల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. కాచిగూడలో నిర్వహించిన కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దశాబ్దాలుగా బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడటానికి కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని కుమారస్వామి విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ జనగణనలో ఓబీసీ కులాల వారీగా లెక్కింపు చేపట్టకపోవడం బీసీల పట్ల జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని అన్నారు. అదే విధంగా ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనగణనలో కుల గణన అమలు అయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కుమారస్వామి స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. బీసీలు రాజకీయంగా బలోపేతం అయినప్పుడే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ దళ్ దక్షిణ రాష్ట్రాల కోఆర్డినేటర్ సత్తార్ కుర్మారావు, యాదవ సంఘం నాయకుడు మణి యాదవ్, మహిళా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్తార్ కుర్మారావు ఆధ్వర్యంలో త్వరలో దక్షిణ రాష్ట్రాల్లో పర్యటించి బీసీ హక్కుల ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని కుమారస్వామి వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here