ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల పనులను పరిశీలించిన గాంధీ, CMC కమిషనర్ సృజన

శేరిలింగంప‌ల్లి, జూన్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మియాపూర్–ఆల్విన్ కాలనీ కారిడార్ అభివృద్ధి పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధికారులతో కలిసి పరిశీలించారు. మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ.530 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 లేన్ బై-డైరెక్షనల్ ఫ్లైఓవర్, హఫీజ్‌పేట్–మియాపూర్ మధ్య 3 లేన్ యూని-డైరెక్షనల్ అండర్‌పాస్, బాచుపల్లి–ఆల్విన్ చౌరస్తా మధ్య మరో 3 లేన్ యూని-డైరెక్షనల్ అండర్‌పాస్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎంసీ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్లు నారాయణ్ అమిత్ మాలెంపాటి, మయాంక్ సింగ్, డీసీ శ్రీనివాస్, చీఫ్ సిటీ ప్లానర్ వెంకన్న, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం, హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్ట్స్ అధికారులు పాల్గొన్నారు.

ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్, బాచుపల్లి ప్రాంతాల మధ్య ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు ప్రయాణ సమయం, వాహనాల ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ పనుల పురోగతి, భూసేకరణ స్థితి, పెండింగ్ ప్రక్రియలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన గాంధీ, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అమలులో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. మియాపూర్–కూకట్‌పల్లి కారిడార్‌లో పెరుగుతున్న రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ రహిత సమాజం, మెరుగైన జీవన ప్రమాణాల లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని కొనసాగిస్తోందన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ రంగం విస్తరణ, జనాభా పెరుగుదలతో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ తులసిరామ్, ఏసీపీ సురేందర్, హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్ట్స్ ఈఈ గోపాల్, డీఈ వరుణ్, ఏఈ శ్రీనాథ్, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం డీఈ శ్రీదేవి, ఎస్‌డబ్ల్యూఎం డీఈ వశిధర్, ఏఈ నిఖిల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here