శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులు ఐటీ సంస్థలు, బిజినెస్ పార్కులు, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో వర్షాకాల సంసిద్ధత చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉద్యోగుల కోసం సంస్థలు నిర్వహించే బస్సు సర్వీసులను పెంచడం, మెట్రోతోపాటు ఇతర ప్రజా రవాణా సేవల వినియోగాన్ని ప్రోత్సహించడం, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉద్యోగుల షటిల్, బస్సు సర్వీసుల విస్తరణ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లాగిన్-లాగౌట్ సమయాల సర్దుబాటు, అవసరమైన చోట్ల దశలవారీ కార్యాలయ సమయాల అమలు ద్వారా పీక్ అవర్ ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే అవకాశాలను సమావేశంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ట్రాఫిక్ అంతరాయాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే అన్ని సంస్థలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ప్రధాన ఐటీ కారిడార్లలో కొనసాగుతున్న, పెండింగ్లో ఉన్న వర్షాకాల మౌలిక వసతుల పనులను సమీక్షించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో సాఫీ ట్రాఫిక్ నిర్వహణ, సురక్షిత ప్రయాణం, సమర్థవంతమైన విపత్తు సంసిద్ధత కోసం పౌర సంస్థలు, ట్రాఫిక్ విభాగం, పరిశ్రమల ప్రతినిధుల మధ్య నిరంతర సమన్వయం అత్యంత కీలకమని సమావేశంలో అభిప్రాయపడ్డారు.





