శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 134లో ఉన్న జంగం కుంట చెరువు 2.35 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, కొందరు కబ్జాదారులు చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సీపీఎం శేరిలింగంపల్లి కార్యదర్శి సి.శోభన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ 1954 నుంచి కాసర పహాని రికార్డులో ఆ చెరువు ఉందని అన్నారు. ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు నీటితో కళకళలాడుతున్న కుంటను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. చెరువులో మట్టితో పూడ్చి చెరువు ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తహసీల్దార్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ చర్యలు తీసుకోలేదని అన్నారు. అలాగే ఈ విషయంపై లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేశామని, అందులో స్థానిక రెవెన్యూ అధికారులు కూడా ఆ స్థలం చెరువు స్థలంగా పేర్కొంటూ నివేదిక ఇచ్చారని తెలిపారు. కనుక వెంటనే హైడ్రా స్పందించి చెరువును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరారు. చెరువును కబ్జా నుంచి రక్షించాలని, కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జోన్ కార్యవర్గ సభ్యులు వి.మాణిక్యం, కె.కృష్ణ, ఎన్.వరుణ్ పాల్గొన్నారు.





