శేరిలింగంపల్లి, జనవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి జన్మదిన వేడుకలను డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ అభిమాన నాయకుడికి భారీ పూలమాలలు వేసి, శాలువాలు కప్పి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ప్రత్యేకంగా హాజరై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

నానక్‌రామ్‌గూడ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకలను టీఎన్‌జీవోస్ కాలనీ, గౌలిదొడ్డి, మంజీరా డైమండ్ హైట్స్, అపర్ణ సైబర్ జోన్, నల్లగండ్ల విలేజ్, గోపనపల్లి, గోపనపల్లి తండా, కేశవ్ నగర్, ఖాజాగూడ, రాయదుర్గం, జీపీఆర్‌ఏ క్వార్టర్స్, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తనపై ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమకు, నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలే తనకు శక్తి, ప్రేరణ అని పేర్కొంటూ, ప్రజల అవసరాలను తీర్చడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే కార్పొరేటర్‌గా పనిచేస్తానని తెలిపారు.

ప్రజల ఆశీస్సులతో కార్పొరేటర్‌గా గెలిచి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని, రోడ్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యుత్ సమస్యల నివారణ, పార్కుల అభివృద్ధి వంటి అనేక ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపామని వివరించారు. ఈ వేడుకలలో గచ్చిబౌలి డివిజన్ ప్రజాప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





