ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో గల డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ లో సావిత్రి బాయి పూలే జన్మదిన వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి హాజరై సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయిని అని అన్నారు. ప్యూడల్ వ్యవస్థను సున్నితంగా ఎదుర్కొని, నిమ్న వర్గాల అభివృద్ధికి అభ్యున్నతికి కృషి చేసిన ధీరురాలు అని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతి రావ్ పూలే భార్యగా, కుల మతాలకు అతీతంగా, సమాజాన్ని ప్రేమించిన, ప్రేమ స్వరూపిణి. చదువుల తల్లి, విద్య ద్వారానే స్త్రీ జాతికి అస్తిత్వ సాధన, సమాజ గౌరవం, అన్నింటికన్నా దాస్య విముక్తి సాధ్య పడుతుందని నమ్మిన దార్శనికురాలని అన్నారు. మహిళల విద్యాభివృద్ధికై కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి భాయి పూలే అని అన్నారు. మహిళా సాధికారాతకై 1852లో మహిళా సేవా మండల్ స్థాపించి, మహిళ హక్కులే మానవ హక్కులని నినదించిన ధీర వనిత సావిత్రి భాయి పూలే అని అన్నారు. ఈ సందర్బంగా భోధనలో రాణిచిన యేరువ కోటేశ్వరమ్మ (డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ) మాలవత్ స్వప్న, పోతుకూచి సోమసుందరం ట్రస్ట్ లో అధ్యాపకులు కారేడి సుచిత్రను జ్ఞాపిక, శాలువా, పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ నిర్వాహకురాలు చావా అరుణ, శ్రీమతి కళ్యాణి, పద్మావతి, సుష్మ మరియు పోతుకూచి సోమసుందరం ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలెం శ్రీను, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here