నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాలను పరిశుభ్రం చేస్తూ పట్టణాన్ని, కాలనీలలో పారిశుద్ధ్య సమస్య లేకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వేకువ జామునే విధులకు హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి కార్పొరేటర్ కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు శనివారం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యల్లో విశ్రాంతి లేకుండా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు కరోనా కష్ట కాలంలో ఫ్రంట్ వారియర్స్ గా నిలబడి ప్రజలకు సేవలు అందించారన్నారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. రోజువారీగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వారి ఆరోగ్య భద్రతా దృష్ట్యా పీపీఈ కిట్లను అందజేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, జీహెచ్ఎంసీ ఎస్ ఆర్ పీ భరత్, శానిటేషన్ సూపర్ వైజర్ రఘు, నగేష్, కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.