బీసీ విద్యార్థి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉరేళ్ల మహేష్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ఇంటర్మీడియట్ బోర్డు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముికాస్తుందని బీసీ విద్యార్థి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉరేళ్ల మహేష్ యాదవ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడినా ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోకపోగా వత్తాసు పలుకుతున్నారన్నారు. ధనార్జనే ధ్యేయంగా విద్యావ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇంటర్ బోర్డ్ అండగా ఉందని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని 80 శాతం కళాశాల ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే పరీక్షల ఫీజు కట్టించుకుంటున్నారని తెలిపారు. ప్రతి నెలా రూ.10 వేల హాస్టల్ ట్యూషన్ ఫీజు చెల్లించుకుంటున్నారని, ఫీజలు చెల్లించని విద్యార్థులను క్లాసులకు అనుమతించడం లేదన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నా ఇంటర్ బోర్డ్ చర్యలు తీసుకోవడం లేదని ఆయన వాపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
