- లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో యువత బలవన్మరణాలు
- అనధికార లోన్ యాప్ సంస్థలపై పోలీసుల ఉక్కుపాదం
- రెండు సంస్థలు సీజ్, ఆరుగురు నిర్వాహకుల అరెస్ట్
- లోన్ కట్టకపోతే అసభ్య దూషణలు… బందువులకు, స్నేహితులకూ తప్పని వేధింపులు
నమస్తే శేరిలింగంపల్లి: నిమిషాల్లో లోన్ కావాలా…? కేవలం ఆధార్, పాన్ కార్డులు ఉంటె చాలు. ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా రుణాలు ఇచ్చేస్తాం. పూర్తి ఆన్లైన్ ప్రాసెస్ తో రెండు వేల నుండి 2 లక్షల వరకూ లోన్ తీసుకోండి అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలకు గాలం వేస్తున్న పలు లోన్ యాప్ సంస్థలు వినియోదారులను అడ్డగోలుగా దోచుకోవడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఈ యాప్ సంస్థల వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడటంతో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుంది.
చిన్న చిన్న అవసరాలకు కొద్దీ మొత్తంలో డబ్బులకోసం హ్యాండ్ లోన్ తీసుకునే వారిని టార్గెట్ చేస్తున్న ఇన్స్టంట్ లోన్ యాప్ సంస్థలు వివిధ సామజిక మాధ్యమాలలో వినియోగదారులను ఆకర్షితున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఈ సంస్థలు ఆకర్షణీయమైన ప్రకటనలతో గాలం వేస్తున్నాయి. ఈ యాప్ ల ద్వారా లోన్ పొందాలంటే ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత మన వ్యక్తిగత వివరాలతో పాటు ఫోన్ లో ఉన్న ఫోన్ నెంబర్లను వారి రికార్డుల్లో భద్రపరచుకుంటారు. అనంతరం వినియోగదారుల ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తదితర వివరాలు అందించిన తర్వాత వారి అర్హతలను బట్టి లోన్ మంజూరు చేస్తారు.
అడ్డగోలుగా వడ్డీలు… వేధింపులతో అరాచకాలు..
ఆన్లైన్ లోన్ యాప్ సంస్థలు ఋణం అందించే ముందే జిఎస్టి, ప్రాసెసింగ్ చార్జీలు, వడ్డీల పేరిట దాదాపు 25 శాతం డబ్బులను కట్ చేస్తారు. గడువు లోపు రుణాలను చెల్లించని వారి వద్దనుండి పెనాల్టీల పేరిట మరింతగా దోచుకుంటున్నారు. ఇక గడువు దాటిన తర్వాత మొదలవుతుంది అసలు కథ. రుణాలను అందిస్తున్న సంస్థలు థర్డ్ పార్టీ కస్టమర్ కేర్ సెంటర్లకు వసూలు బాధ్యతలను అప్పగిస్తున్నాయి. రుణాలు చెల్లించని వారి వివరాలతో పాటు వారి సంబంధీకుల ఫోన్ నెంబర్లను ఈ కస్టమర్ కేర్ సంస్థలకు అందజేస్తాయి. అప్పు చెల్లించని వినియోగదారులను మూడు వర్గాలుగా విభజిస్తున్నారు. గడువు ముగిసి మూడు రోజుల లోపు ఉన్న వారిని ఎస్ 1 లిస్టు లో, 10 రోజుల లోపు ఉన్న వారిని ఎస్ 2 గా, నెల రోజులైనా చెల్లించని వారిని ఎస్ 3 లిస్టులో ఉంచుతారు. ప్రతిరోజూ మెసేజులు, ఫోన్ కాల్స్ తో ఋణం చెల్లించాలని వేధించడం తో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తుంటారు. ఇంట్లోని మహిళలకు సైతం ఫోన్లు చేసి వేధిస్తారు.లీగల్ నోటీసులు పంపిస్తామని, పోలీసులకు పిర్యాదు చేస్తామని బెదిరిస్తారు. చివరగా ఋణం తీసుకున్న వ్యక్తి ఫోటో పై ఫ్రాడ్,దొంగ అంటూ ముద్రించి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారందరికీ పంపించి పరువు తీసేస్తారు.
రెండు సంస్థల సీజ్, ఆరుగురు నిర్వాహకుల అరెస్ట్…
లోన్ యాప్ సంస్థల వేధింపులతో పలువురు ఆత్మహత్యలకు పాలపడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు మంగళవారం రెండు సంస్థల నిర్వాహకులను అరెస్టు చేశారు. ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ పేరు గల సంస్థలు క్యాష్ మామా, లోన్ జోన్, ధనా ధన్ లోన్, క్యాష్ అప్, క్యాష్ బస్, మేరా లోన్, క్యాష్ జోన్ అనే యాప్‌లను రూపొందించారు. వాటిల్లో క్యాష్ బస్, క్యాష్ అప్ అనే రెండు యాప్‌లను ఢిల్లీకి చెందిన ఏషియా ఇన్నో నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు. ఇక మేరా లోన్, క్యాష్ జోన్ అనే యాప్‌లను బెంగళూరుకు చెందిన బ్లూ షీల్డ్ ఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి విక్రయించారు. క్యాష్ మామా అనే యాప్‌ను ఆనియన్ క్రెడిట్ కంపెనీ నిర్వహిస్తుండగా, ధనా ధన్ లోన్, లోన్ జోన్ యాప్‌లను క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ నిర్వహిస్తోంది. అయితే పేర్లు వేరైనా నిజానికి ఈ రెండు కంపెనీలు ఒక్కటే అని చెప్పవచ్చు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో తమ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థల నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు వారి అకౌంట్లను సీజ్ చేశారు. ఈ రెండు సంస్థల వద్ద నుండి ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర మంది రుణాలు తీసుకున్నట్లు సమాచారం. కాగా అనుమతి లేని లోన్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తీసేయాలని ఆదేశిస్తూ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు నోటీసులు పంపామని సీపీ సజ్జనార్ తెలిపారు.

ఆన్లైన్ లో లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి.
- పలు యాప్ ల ద్వారా రుణాలు తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
- ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలచే గుర్తింపు లేని లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకూడదు.
- వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఇతరులకు ఇవ్వరాదు.
- వినియోగదారులు తాము వాడే యాప్‌కు సంబంధించి ఆర్‌బీఐ గుర్తింపు ఉందా, లేదా అనే వివరాలను ఒక్కసారి పరిశీలించాలి. యాప్‌కు లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
- ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫైల్స్, గ్యాలరీలకు యాక్సెస్ ఇవ్వాలని అడిగే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకూడదు.