- భారీ వర్షాలు ఉన్నాయన్న సర్కారు
- ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచన
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని కనుక ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చెప్పింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు కూడా వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. వర్షాల నేపథ్యంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడిందని, ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు భారీ వర్షానికి అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కాగా గ్రేటర్ పౌరుల కోసం బల్దియా ఇప్పటికే పలు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బోట్లను కూడా తెప్పించారు.