- చందానగర్ సర్కిల్ కు పీజేఆర్, శేరిలింగంపల్లికి గచ్చిబౌలి స్టేడియం ఎంపిక
- ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జోనల్, ఉప కమిషనర్లు
నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలకమండలి ఎన్నికల ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం ఈసారి సర్కిళ్ల వారిగా డీఆర్సీ (డిస్ట్రీబూషన్, రిసీవింగ్, కౌంటింగ్)సెంటర్ ను కేటాయించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన జరగనుండగా, ఎన్నికల ముందు బ్యాలెట్ పేపర్లు, బాక్సులను ఎన్నికల అధికారులకు అందజేయడం మొదలు, ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్ర పరచడం, ఓట్ల లెక్కింపు వరకు అన్ని ప్రక్రియలు ఈ కేంద్రాల్లోనే జరుగనున్నాయి. చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్, మియాపూర్, హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ల కు స్థానికంగా గల పీజేఆర్ స్టేడియంను ఎంపిక చేయగా, శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి డివిజన్లకు గచ్చిబౌలి స్టేడియం ను కేంద్రంగా అధికారులు నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన అనంతరం అధికారులు ఈ కేంద్రాలను స్వాధీనపరచుకోనున్నారు. కాగా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా, అందుకనుగుణంగా జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు గత వారం రోజుల నుంచె పర్యవేక్షిస్తున్నారు.
చందానగర్ స్టేడియంను పరిశీలించిన జెడ్సీ, డిసీలు…
చందానగర్ సర్కిల్ డిఆర్సీ కేంద్రంగా ఎంపిక చేసిన పీజేఆర్ స్టేడియంను శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ రవికిరణ్, డిప్యూటీ కమీషనర్ సుధాంశులు పలు విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి అనుకూల అంశాలు, బ్యాలెట్ బాక్సులను భద్ర పరిచే స్ట్రాంగ్ రూములు, ఇతర ఏర్పాట్లపై సిబ్బందితో కలిసి చర్చించారు. స్టేడియం లోని ఇండోర్ స్టేడియం, దాని అనుబంధ గదుల్లో బ్యాలెట్ బాక్సులు భద్రపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
గచ్చిబౌలి స్టేడియంను సందర్శించిన డీసీ వెంకన్న…
శేరిలింగంపల్లి సర్కిల్ డీఆర్సి సెంటర్ గచ్చిబౌలి స్టేడియంను సర్కిల్ డిప్యూటీ కమీషనర్ తేజావత్ వెంకన్న సందర్శించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గచ్చిబౌలి స్టేడియం డీఆర్సీ కేంద్రంగా ఉన్నది. గతంలో ఇక్కడ ఎన్నిక ప్రక్రియ జరగడంతో తాజా ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నట్లు వెంకన్న తెలిపారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూములు అందుబాటులో ఉన్నాయని అయన తెలిపారు. బయట ఉన్న ఖాళీ స్థలంలో బ్యాలెట్ పేపర్లు, బాక్సుల పంపిణీ, అనంతరం స్వీకరణ అక్కడే సైతం జరుగుతుందని తెలిపారు.