చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): ఆక్రమణలకు గురైన గంగారం పెద్దచెరువు శిఖం, బఫర్ జోన్ స్థలాలతో పాటు కాలువలను పునరుద్దరిరించి చెరువును పూర్వస్థితికి తీసుకురావాలని జనంకోసం సంస్థ అధ్యక్షులు, గౌతమీనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమీషనర్, రాజేంద్ర నగర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి తహశీల్దారు,నార్త్ ట్యాంక్ డివిజన్ ఇరిగేషన్ ఈఈ, వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్, చందానగర్ డిప్యూటీ కమీషనర్ లకు గంగారాం పెద్దచెరువు అక్రమణలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలంలో గంగారం పెద్ద చెరువు దాదాపు 130 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఈ చెరువును అభివృద్ధి పేరుతో నాశనం చేస్తున్నారని తెలిపారు. గంగారం పెద్ద చెరువు కింది భాగంలో ఉన్న గొలుసుకట్టు కాలువల ఆక్రమణల కారణంగా కాలనీలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. గంగారం ఎస్సీ బస్తీ, అన్నపూర్ణ ఎన్క్లేవ్, శిల్ప ఎన్క్లేవ్, గౌతమీ నగర్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాలు ప్రతియేడూ ముంపునకు గురవుతున్నాయని, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. చెరువు అక్రమణలపై అనేక ఫిర్యాదులు చేశామని, గంగారం పెద్ద చెరువు తూములు, సహజ కాలువల్లో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలన్నారు. మూసివేసిన తూములను పునరుద్ధరించడం తో పాటు, తూముపై వేసిన రోడ్లను తొలగించాలన్నారు. చెరువు బఫర్ జోన్ ను పునరుద్ధరించడంతో ఓటు చెరువు కట్ట కింద ఆక్రమణలను తొలగించాలన్నారు. అక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనం కోసం తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.