నమస్తే శేరిలింగంపల్లి: పొన్నగంటి కూర అంటే పట్నంలో పెద్దగా గుర్తుపట్టేవాళ్ళు ఉండకపోవచ్చు కానీ పల్లె ప్రాంతాల్లో అప్పుడప్పుడు పప్పుగానో, కూరగానో పల్లెవాసుల ఆహారపు అలవాట్లలో భాగంగానే ఉంటుంది. ఆహారమే దివ్య ఔషధం అని పెద్దలు చెప్పిన విషయానికి నేటి తరం వారు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు. కరోనా పుణ్యమా అని ఆరోగ్యం అంటే తెలియని వారు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. మన పూర్వికులు తినే ఆహారాన్ని మించిన మందు లేదని చెప్పిన విషయాన్నే సైంటిస్టులు సైతం రూఢి చేయడంతో పాత కాలపు ఆహారపు అలవాట్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక పొన్నగంటి కూర విషయానికి వస్తే ఈ ఆకుకూర పేరులోనే దీని గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది. పోయిన కంటి చూపును సైతం తిరిగి తెప్పించే గుణం ఈ ఆకుకూరలో ఉందనేది తెలంగాణ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉంది. పోయిన కంటి కూర అనే పేరు కాలక్రమంలో పొన్నకంటి/పొన్నగంటి కూరగా స్థిరపడింది.
ఇదీ దీని పోషక విలువ…
అమరాంతేసి కుటుంబానికి చెందిన ఈ ఆకుకూర శాస్త్రీయ నామం ఆల్టర్నాంతెరా సెస్సిలిస్. సంస్కృతంలో దీనికి మత్యాక్షి అని పేరు. పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి వర్షాకాలంలో దీని లభ్యత ఎక్కువ. ఈ ఆకుల్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, విటమిన్లు ఎ, సి, బి6, ఫొలేట్, రైబోఫ్లెవిన్ లతో పాటు ఐరన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంలు సమృద్ధిగా ఉంటాయి.
ప్రయోజనాలు మెండు…
ముందు చెప్పిన విధంగా కంటి చూపుకు ఈ ఆకుకూర దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. అధిక బరువు గలవారు దీనిని వాడటం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి.
Good coverage Brother, ఆకుకూరలు గురించి బాగా వ్రాశారు అందులో పోనగంటి కూర గురించి ఇచ్చిన సమాచారం బాగుంది