
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): పేద ప్రజల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలో కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ లబ్దిదారులకు మంజూరైన చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదింటి ఆడపిల్లల పెండ్లి భారాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశ్యంతో పెళ్ళికి కానుకగా కల్యాణ లక్ష్మి , షాదిముబారక్ పధకం ద్వారా రూ.1,00,116 రూపాయలు ఇవ్వడం పేద కుటుంబాలకు ఒక వరం లాంటిది అని ఈ పధకం పేదింటి ఆడపిల్లల తల్లితండ్రులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కెసిఆర్ కిట్, ఒంటరిమహిళలకు జీవన భృతి, వృద్యాప్య, వికలాంగ పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారని తెలిపారు. రైతులకోసం మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా పథకాలు, ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తో పాటుగా అమ్మఒడి, ఆరోగ్య లక్ష్మి, కంటి వెలుగు, చేనేత లక్ష్మి, తెలంగాణకు హరితహరం, టి హబ్ వంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు గోవర్ధన్, విఆర్ఓ యాదగిరి, విఆర్ఏ ధనరాజ్ మరియు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగంధం రాములు, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఉరిటీ వెంకట్రావు , రావూరి సైదేశ్వర్ రావు, బ్రిక్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.





