– కుల దురహంకార హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి: మాజీ ఎంఎల్సీ చెరుపల్లి సీతారాములు
చందానగర్ (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న కుల దురహంకార హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకొని మామ, బందువుల చేతిలో బలైన హేమంత్ కుటుంబ సభ్యులను ఆదివారం వారి నివాసంలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రణయ్, నరేష్ లాంటి కుల దురహంకార హత్యల జరుగుతన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే హేమంత్ బలయ్యాడని అన్నారు. కుల అహంకారం పై వివిధ రాజకీయ పార్టీల వైఖరి మారాలని ఆయన రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు. కులాంతర వివాహాలు చేసుకుంటే ఇలా మనుషులను చంపటం మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి దుశ్చర్య ల వల్ల సమాజానికి చెడు సంకేతాలు వెళ్తాయని, ప్రభుత్వం గుర్తించి ఇలాంటి ఘటనలపై తీవ్రమైన చర్యలు తీసుకున్నప్పుడే మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో వరుసగా జరగడం చాలా దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. హేమంత్ హత్య కు బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని తమ పార్టీ గా డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. పోలీసులు ఇలాంటి కేసులను తీవ్రంగా పరిగణించి అన్ని రకాల సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హేమంత్ కుటుంబ సభ్యులను కలిసిన వారిలో రంగారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ చందర్, శేరిలింగంపల్లి నాయకులు శోభన్, మాణిక్యం, కృష్ణ, జగదీష్, సురేష్, మరియు బీజేపీ స్థానిక నాయకులు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.