ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆద్వర్యంలో ఇంజనీర్లకు సత్కారం
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని సూపర్ విజ్ జూనియర్ కళాశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో మంగళవారం ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్ర పటానికి అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య గారు సివిల్ ఇంజినీర్ గా, ఆర్ధికవేత్తగా, నీటి యాజమాన్య నిపుణుడిగా, అనేక డాములలు నిర్మాత గా, స్టేట్స్ మెన్ గా, బహుముఖ ప్రజ్ఞ ను ప్రదర్శించి దేశ ఆర్ధిక పరిపుష్టికి, భారతావని మరియు ప్రపంచ ప్రగతికి బలమైన పునాదులు వేసిన వ్యక్తి అని అన్నారు. జాతి గర్వించదగ్గ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అని తెలిపారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఆనకట్టలు దెబ్బతినకుండా ఉండటానికి ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ రూపొందించారు. ఎక్కువ నీటిని నిల్వ ఉంచే విధంగా కృషి చేసిన గొప్ప ప్రతిభాశాలి . హైదరాబాద్ మహానగరం వరదముంపునకు గురి కాకుండా ఉండటానికి నిజాం నవాబు గారి విజ్ఞప్తి మేరకు గండిపేట, హిమాయిత్ సాగర్ రిజర్వాయర్ లను నిర్మాణం చేయించి వరద నీటిని ఆ రిజర్వాయర్ లోకి మళ్లించారు. ఆ నీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటికొరకు వినియోగించి సమస్యను పరిష్కరించారు. అలాగే హైదరాబాద్ నగరం లో మురుగునీటి పారుదల సిస్టమ్ ని నిర్మించి హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషిచేశారు. విశాఖపట్నం సముద్ర కోతకు గురికాకుండా ప్రత్యేకమైనటువంటి తన మేధా సంపత్తి తో పలు సూచనలు చేశారు. తిరుమల ఘాట్ రోడ్డు నిర్మాణంలో కీలకపాత్ర వహించారు. విశ్వేశ్వరయ్య తెలుగువాడిగా మనందరికీ గర్వకారణం అని తెలిపారు. నేటి ఇంజినీర్లు ఆయన జీవితమును ఆదర్శంగా తీసుకొని నీతి, నిజాయితీ, నిబద్ధతలతో దేశాభివృద్ధి కి కృషిచేయాలన్నారు. వారు చేసిన సేవలకు గుర్తింపు గా భారత ప్రభుత్వం 1955 లో భారతరత్న తో సత్కరించటం జరిగింది. నిండు నూరేళ్లు పరిపూర్ణమైన జీవితం గడిపారు అని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు అక్తర్ ఖాన్ సౌజన్యంతో బల్దియా, జలమండలి, సీపీడబ్ల్యూడీ, ఆర్ ఆండ్ బీ, భెల్, ఇరిగేషన్, విద్యుత్ మండలి విభాగాలకు చెందిన పలు ఇంజినీర్ల ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు, శివరామకృష్ణ, ఖాదర్,మల్లేష్ , పాలం శ్రీను, దాది రామకృష్ణ, జనార్దన్, రజని, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.