- రాజశ్యామల యాగంలో ఎమ్మెల్సీ, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి దంపతులు
- వేడుకలకు హాజరైన ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ, స్థానిక కార్పొరేటర్లు
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో హరిహరుల వైభవోత్సవాలు మూడో రోజు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, ప్రధాన, కళాహోమాలు, రుద్ర కల్పము, శ్రీ భూ వరాహ స్వామికి పంచామృతాభిషేకం చేశారు. అదేవిధంగా ఉత్సవాల్లో ప్రతిరోజు మాదిరిగా పండితులు, స్థానిక ప్రముఖులు కలసి చండీ హోమం ఆచరించారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
స్వర్ణ పుష్పాలతో శ్రీవారిని సేవించిన గవర్నర్…
వైభవోత్సవాల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్య అతిథిగా హాజరై హరిహరులను దర్శించుకుని, స్వర్ణ పుష్పాలతో పూజలు చేశారు. ఆలయ మహారాజ పోషకాలు కలిదిండి సత్యనారాయణ రాజు, జాన్సీలక్ష్మీ దంపతులు సమర్పించిన సువర్ణ తాపడ ధ్వజస్థంభం, బంగారు ఆభరణాలను గవర్నర్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిమను బహూకరించారు. గవర్నరు నుదుట తిలకం దిద్ది రాజశ్యామల అమ్మవారి రక్షారేఖను కట్టి ఆమెను ఆశీర్వదించారు.
కరోనా విపత్తు నుంచి ప్రజలు బయట పడాలి: తమిళ సై సౌందర్ రాజన్
ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక మార్గంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు చేపడుతున్న కృషి అభినందనీయమని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలంతా బయటపడాలని స్వామీజీని కోరుకున్నట్లు తెలిపారు. చందానగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు శోభాయమానంగా ఉన్నాయని అన్నారు.
ఉత్సవాలకు హాజరైన ప్రముఖులు…
ఉత్సవాల్లో భాగంగా కొనసాగుతున్నరాజశ్యామల యాగంలో ఎమ్మెల్సీ, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘనాథ్ రెడ్డిలు శ్రీవారిని దర్శించుకున్నారు. పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి చేతుల మీదుగా ఆలయ పాలకమండలి అతిథులను ఘనంగా సత్కరించింది. అనంతరం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఆశీర్వదించారు.
రాజశ్యామల దేవికి వెండి దీపపు కుంది సమర్పించిన పీఠం భక్తుడు…
విశాఖ శారదా పీఠంలో కొలువై ఉన్న శ్రీ రాజశ్యామల అమ్మ వారికి శారదా పీఠం భక్తుడు పి.ధర్మ వెండి దీపపు కుంది సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతికి కుందిని అందజేశారు. పీఠం రాష్ట్ర ఆగమ సలహాదారు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి శర్మ పర్యవేక్షణలో కొనసాగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కె. రఘుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి తూడి సుభాష్, ఉపాధ్యక్షులు తోట సుబ్బారాయుడు, పి.అశోక్‌గౌడ్, ఉపకార్యదర్శి కె.దేవేందర్ రెడ్డి, సభ్యులు వెంకట శేషయ్య, నాగేశ్వర్‌రావు, బ్రహ్మయ్య గుప్త, రాంగోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.