నమస్తే శేరిలింగంపల్లి:హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎం సిపిఐయు అభ్యర్థి కర్ర రాజిరెడ్డిని గెలిపించాలని ఎం సిపిఐ యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ ఓంకార్ భవన్ బాగ్ లింగంపల్లి ఎం సిపిఐయు రాష్ట్ర కార్యాలయంలో కామ్రేడ్ తాండ్ర కుమార్ మాట్లాడారు. హుజురాబాద్ లో అక్టోబర్ 30 న జరగనున్న ఉప ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బలపరిచిన ఎం సిపిఐయు అభ్యర్థి కామ్రేడ్ కర్ర రాజి రెడ్డి కంప్యూటర్ గుర్తు సీరియల్ నెంబర్ 6 పై ప్రజలు ఓటేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు పేద ప్రజల పాలిట శాపంగా మారాయన్నారు. ఇచ్చిన వాగ్దానాలను మరిచి ప్రజల సమస్యలను విస్మరించారని ఎద్దేవా చేశారు. సిపిఐ, సిపిఎం ద్వంద్వ విధానాల వల్ల ప్రజల సమస్యలు పెరుగుతున్నాయని, బూర్జువా పార్టీలు ఓట్ల రాజకీయాలు ఎలా చేస్తాయో సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఓట్ల రాజకీయాలు చేస్తూ విప్లవ స్వభావాన్ని కోల్పోతున్నాయని అన్నారు. పార్లమెంటరీ డొల్లతనాన్ని ఎన్నికల ను వేదికగా చేసుకొని ప్రజా ప్రత్యామ్నాయాన్ని పోరాట రూపం లో నిర్మించాల్సింది పోయి ఒక బూర్జువా పార్టీకి మరో బూర్జువా పార్టీ ప్రత్యామ్నాయమని పెట్టుబడిదారి వర్గాల సేవకులుగా కమ్యూనిస్టులు దిగజారడం వలన ప్రజల్లో చులకన అవుతున్నామని నీతి నిజాయితీగా పనిచేసి చిన్న కమ్యూనిస్టు పార్టీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విధానాలు పెద్ద కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఐ, సిపిఎం మార్చుకోకపోతే భవిష్యత్తులో భారతదేశంలో బూర్జువాల సరసన సిపిఐ సిపిఎం పార్టీల ను చూడాల్సి వస్తుందని, సిపిఐ, సిపిఎం మహాసభలు జరుపుకుంటున్న సమయంలో బిజెపి మతోన్మాదం బూచిని చూపించి కమ్యూనిస్టు ఉద్యమ త్యాగధనుల చరిత్రను నీరుకార్చవద్దని తాండ్ర కుమార్ సూచించారు. సమావేశం లో ఎం సిపిఐయు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాధగోని రవి, వల్లెపు ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.
