- చందానగర్‌లోని హేమదుర్గ శారదా గెలాక్సీ ఆపార్ట్‌మెంట్ సంపులోంచి బయటపడ్డ మృతదేహం…
నమస్తే శేరిలింగంపల్లి: ఓ కాంప్లెక్స్‌లోని నీటి సంపులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం దర్శనమిచ్చిన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌లోని ప్రధాన నాలాను ఆనుకుని ఉన్నహేమదుర్గ శారదా గెలాక్సీ అపార్ట్మెంట్ లోపి సంపులో నుంచి దుర్గంధం వస్తుండటంతో బుదవారం సాయంత్రం అపార్ట్‌మెంట్ వాసులు సంపులోకి తొంగి చూడగా ఓ వ్యక్తి మృత దేహం ఉందని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెళికి తీసేందుకు ప్రయత్నం చేశారు.

సంపు మూత చిన్నదిగా ఉండటంతో మృతదేహాన్ని వెళికి తీయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అపార్ట్‌మెంట్ వెలుపలి నుంచి జేసీబీతో సంపును పగులగొట్టి మృతదేహాన్ని వెళికితీశారు. కాగా మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, ఎస్ఐలు చాంద్‌పాషా, రాములు ఆ పనులను పర్యవేక్షించారు. మృతదేహం స్థితిని బట్టి నాలుగు రోజుల నుంచి సంపులోనే ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు. 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల సదరు మృతదేహం ఎవరిది, ఎందుకు సంపులో పడి ఉంది, ఎవరైనా హత్య చేశారా లేకా ప్రమాదవశాత్తు పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
